38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక పండుగ) ఏర్పాట్లపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ పత్రిక సమావేశం.
- vinoo Sparkles
- Dec 18, 2025
- 2 min read

డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక పండుగ) ఏర్పాట్లపై సమాచారం అందించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నేడు (డిసెంబర్ 18) ఒక పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయడానికి విస్తృత
ప్రచారం చేసి, పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని సొసైటీ కోరింది. ఈ పుస్తక ప్రదర్శనకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.
గురువారం(18-12-2025), హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బి. శోభన్ బాబు, కార్యదర్శి ఆర్. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు కె. సూరిబాబు, కోశాధికారి పి. నారాయణ రెడ్డి మాట్లాడారు.
పుస్తక స్ఫూర్తి పైలాన్
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ‘పుస్తక స్ఫూర్తి పైలాన్’ అనే ఎనిమిది అడుగుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పుస్తక పఠనాన్ని ప్రజల్లోకి, సాహిత్యకారుల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సింబాలిక్‌గా ఈ పైలాన్‌ను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నట్లు సొసైటీ తెలిపింది. ఈ పుస్తక స్ఫూర్తి పైలాన్‌ను గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరిస్తారు.
గౌరవ అతిథులుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్, కే. రామచంద్రమూర్తి, రమా మేల్కోటె ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు.
ప్రాంగణాలు, వేదికల నామకరణం
ఈసారి మొత్తం ప్రాంగణానికి ప్రజా కవి అందెశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. వివిధ వేదికలు, ప్రాంగణ భాగాలకు ప్రముఖుల పేర్లు పెట్టారు.
ప్రధాన వేదికను అనిశెట్టి రజిత గారి పేరున నామకరణం చేశారు.
పుస్తకావిష్కరణల వేదికకు సాహితీవేత్త కొంపల్లి వెంకట్ గౌడ్ పేరు పెట్టారు.
రైటర్స్ స్టాల్స్‌కు ప్రొఫెసర్ ఎస్.వి. రామారావు గారి పేరు నిర్ణయించారు.
మీడియా స్టాల్స్‌కు స్వేచ్ఛ ఒటార్కర్ గారి పేరు పెట్టారు.
ఏర్పాట్లు, స్టాల్స్ వివరాలు
ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణంలో మొత్తం 367 స్టాల్స్‌తో ప్రారంభం కానుంది. వీటిలో ప్రభుత్వానికి సంబంధించిన 20 స్టాల్స్‌ను ఎంట్రన్స్‌లో లెఫ్ట్ సైడ్ కేటాయించారు. మీడియాకు మొత్తం 20 చిన్న స్టాల్స్‌ను చిన్న వేదికకు ఇరువైపులా కేటాయించారు. మీడియాకు ఇస్తున్న స్టాల్స్‌ను సొసైటీ ఉచితంగా కేటాయిస్తోంది. రైటర్స్ కోసం ఎంట్రన్స్‌లో రైట్ సైడ్‌లో తొమ్మిది స్టాల్స్ కేటాయించారు. రైటర్స్ సౌలభ్యం కోసం ఒక్కో స్టాల్‌కు ముగ్గురు రైటర్స్‌ను కేటాయిస్తున్నారు.
కార్యక్రమాల వివరాలు
ప్రతిరోజు పుస్తకావిష్కరణ వేదికపై ఆరు స్లాట్స్‌లో పుస్తకావిష్కరణలు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు మొత్తం 54 పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయి.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బాలోత్సవ కార్యక్రమం ఉంటుంది.
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భాషా సాంస్కృతిక శాఖ పంపించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమాలు మూడు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్‌లో ప్రముఖుల సందేశాలు, మిగతా రెండు సెషన్లలో పుస్తకం విలువ, ప్రాముఖ్యత, సాహితీవేత్తల ఇష్టమైన పుస్తకాలపై చర్చలు ఉంటాయి. గత సంవత్సరం 300 మందికి పైగా సాహితీవేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కొత్త సౌకర్యాలు, మార్పులు
పిల్లల కోసం ఆట వస్తువుల స్పేస్‌ను ప్రధాన వేదిక ఎదురుగా ఏర్పాటు చేస్తున్నారు.
పెద్దలు విశ్రాంతి తీసుకునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు.
లోపలే ఫిల్టర్ కాఫీ, టీ సౌకర్యం కల్పించారు.
రెండు వైపులా మెరుగైన టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.
పాత పుస్తకాల స్టాల్స్‌ను 60 నుంచి 40కి తగ్గించారు.
ప్రవేశ వివరాలు
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విద్యార్థులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా ఐడి కార్డు తీసుకురావాలి. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, సాహితీ మిత్రులు, రచయితల కోసం 20 వేల పాసులను కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ, బుక్ ఫెయిర్ విజయవంతం కావడంలో మీడియా పాత్ర కీలకమని, ఈ ఏడాది కూడా సహకారం అందించాలని కోరారు. భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నామని తెలిపారు.
డిసెంబర్ 24న బుక్ వాక్ నిర్వహించనున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై బుక్ ఫెయిర్ ప్రాంగణంలో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు.



Comments